నమస్తే శ్రీ తేజ న్యూస్, విశాఖపట్నం: ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతకు తమ సంస్థ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ లోని లీ ఫార్మా, లీ హెల్త్ డొమైన్ సంస్థలు హోబెల్ బెల్లోస్ కంపెనీ సహకారంతో ఉద్యోగుల కోసం ఉచిత ఎముకలు, కీళ్ల ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించగా, సుమారు 200 మందికి పైగా ఉద్యోగులు పాల్గొని వైద్య సేవలు పొందారు. శిబిరంలో భాగంగా ఉద్యోగులకు ఎత్తు, బరువు, నడుము-నెలవు నిష్పత్తి, హిమోగ్లోబిన్, రాండమ్ బ్లడ్ షుగర్, రక్తపోటు, హ్యాండ్ గ్రిప్ స్ట్రెంత్, శరీర ఉష్ణోగ్రత, బాడీ కంపోజిషన్, బోన్ మినరల్ డెన్సిటీ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యులు, న్యూట్రిషనిస్ట్‌లు పరీక్షల నివేదికలను పరిశీలించి ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు. అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి మాట్లాడుతూ, శరీరంలో ఎముకలు, కీళ్ల సంరక్షణకు ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, సరైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని కోరారు. వైద్య శిబిరానికి జయలక్ష్మి, సరోజిని సమన్వయకర్తలుగా వ్యవహరించగా, డాక్టర్ రాధిక వైద్య సేవలు అందించారు. న్యూట్రిషనిస్ట్‌లు మాధురి, క్రాంతి, జీఎన్‌ఎమ్ సిబ్బంది భాగ్యలత, పవని, హోబెల్ బెల్లోస్ సీఓఓ వర్మతో పాటు లీ ఫార్మా, హోబెల్ బెల్లోస్ బృందాలు చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి.