కంచికచర్ల: కంచికచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటేనే రోగులు భయపడుతున్నారు. పేద ప్రజలు అనారోగ్యం పాలైతే వెళ్ళేది ప్రభుత్వ ఆసుపత్రికే.అలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే కంచికచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారి లేకుండా పోయింది.
సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే మట్టి రోడ్డు వర్షపు నీటితో నిండి బురద మయంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోడ్డు..ప్రధాన రహదారి (ఎన్ హెచ్ 65) నుండి గొట్టుముక్కల రోడ్డుకు అనుసంధానం అవుతుంది. ఆ రోడ్డును ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం గ్రావెల్ తో వేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోడ్డు వర్షం పడినప్పుడు బురద మయమై ఆస్పత్రికి వచ్చే రోగుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవు తున్నా యి.
దాంతో అనారోగ్యం పాలైన రోగులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లే దారి లేక అవస్థలు పడుతున్నారు. గతంలో అనేకసార్లు సంబంధిత అధికారులకు విన్నవించు కున్నప్పటికీ, అనేక సార్లు పత్రికలలో వార్తలు వచ్చినప్పటికీ వాటిని అధికారులు పట్టించు కోవడం మానేశారు. స్థానిక నాయకులకు తెలిసి నప్పటికీ ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు.ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగుల కష్టాలను గుర్తించి త్వరిత గతిన రోడ్డు వేసి రోగుల కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.