అరుణాచలం మోక్ష మార్గంలో చిక్కుకున్న ఏపీ మహిళ.. భక్తుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్లైయార్ గుహ (మోక్ష మార్గం)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు చిక్కుకుపోయి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఆమె మోక్ష మార్గంలోకి ప్రవేశించగా, మధ్యలోనే ఇరుక్కుపోయారు. ఊపిరి అందక తీవ్ర ఆందోళనకు గురై కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు వెంటనే స్పందించి ఎంతో శ్రమించి ఆమెను బయటకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మూడు రోజుల క్రితమే ఇదే మోక్ష మార్గంలో ఏపీకి చెందిన మణికుమార్ అనే భక్తుడు ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందిన ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.