\రాజీవ్ (భర్త)కు ఉన్న శారీరక లోపాన్ని దాచి పెళ్లి చేశారు. వారు మతం మారిన విషయాన్ని దాచారు’ అని వైసీపీ నేత జోగి రమేశ్ కుటుంబంపై ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోడలు మేఘన సంచలన వివరాలు వెల్లడించింది. తనను హత్య చేయడానికి జోగి రమేశ్ కుటుంబ సభ్యులు మూడుసార్లు ప్రయత్నించారని మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
గోవా పర్యటనలో చీకటి ప్రాంతంలో ఒంటరిగా వదిలేయడంతో పాటు, క్యాసినో ఉన్న ఓడపై నుంచి నీటిలోకి తోసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అనంతరం నార్సింగి విల్లా, ఘట్‌కేసర్ ఫామ్‌హౌస్‌లో భర్త రాజీవ్, మామ జోగి రమేశ్, అత్త శకుంతల తదితరులు తనపై దాడి చేసి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేందుకు యత్నించారని ఆరోపించారు.
ఇబ్రహీంపట్నంలోని ఇంటి మూడో అంతస్తులో తనను బంధించి ఉంచి, డ్రోన్‌తో నిఘా పెట్టారని, మరోసారి టెర్రస్‌పై నుంచి కిందకు తోసేయాలని కుట్ర చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇవన్నీ మేఘన తన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిపై దర్యాప్తు కొనసాగుతోంది.