చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం కడపల్లె వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై అదుపుతప్పిన మినీ లారీ ముందుగా బైక్‌ను, అనంతరం రోడ్డుపక్కన నిలిపి ఉన్న నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొట్టి జనాలపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో శివపురానికి చెందిన సుందరప్ప (60) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మునివెంకటమ్మ (55), అనంతపురం జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలుడు సాత్విక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
గాయపడిన వారిలో అక్షయ, నందిని, కనకవల్లి, సతీశ్, లక్ష్మితో పాటు మినీ లారీ డ్రైవర్ కుప్పుస్వామి ఉన్నారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న కుప్పం డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.