రాజమండ్రి జైలులోనే విచారణ ఆచరణీయం కాదన్న సుప్రీంకోర్టు.. సీసీటీవీ, వీడియోగ్రఫీతో విచారణ కొనసాగించాలని స్పష్టం

రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడు సీఐ నాగరాజు విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాగరాజును సిట్ కార్యాలయంలోనే కస్టడీ విచారణకు అనుమతిస్తూ, దర్యాప్తు అధికారికి ఇంటరాగేషన్ నిర్వహించే స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది.

రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారణ జరపాలన్న హైకోర్టు షరతు ఆచరణీయం కాదని పేర్కొన్న సుప్రీంకోర్టు, దానిని సమర్థించలేమని తెలిపింది. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తేదీ నుంచి ఏడు రోజులపాటు పోలీసు కస్టడీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే విచారణ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో, వీడియోగ్రఫీతో నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ రాజమండ్రి జైలు నుంచి విజయవాడ వరకు ప్రతి కదలికను వీడియో రికార్డింగ్ చేయాలన్న షరతు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ సమర్థవంతంగా సాగేందుకు ఆటంకం కలిగించే షరతులను తొలగిస్తూ, దర్యాప్తు పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.