రైతులకు అవసరమైన ఎరువులను ఏపి ఎఐఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని రైతుల అవసరాలకు అనుగుణంగా సకాలంలో ఎరువులను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎరువుల అమ్మకదారులను ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని మనగ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయాల నమోదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లు, రైతులకు జారీ చేస్తున్న బిల్లులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను పారదర్శకంగా, సమర్థవంతంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ యాప్‌ను తీసుకువచ్చిందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి యాప్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గత ఏడాది ఖరీఫ్ పంట నమోదును ఏపీఏఐఎంఎస్ యాప్‌తో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఎరువుల అమ్మకదారులు యాప్‌లో లాగిన్ అయి రైతు ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని, అనంతరం రైతు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన తర్వాత రైతుకు సంబంధించిన భూమి, పంట వివరాలు యాప్‌లో నమోదై ఉంటాయన్నారు. రైతు సాగు చేస్తున్న పంట అవసరాలకు అనుగుణంగా మొదటి, రెండో, మూడో విడతలుగా ఎరువులను సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి డోస్‌కు తదుపరి డోస్ మధ్య కనీసం 20 రోజుల వ్యవధి ఉండేలా ఎరువుల పంపిణీ నిర్వహించాలన్నారు. ఎరువుల విక్రయాలు తప్పనిసరిగా ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను పాటించకుండా వ్యవహరించినట్లయితే సంబంధిత అమ్మకదారుల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో, పారదర్శకంగా అందేలా ప్రతి ఎరువుల అమ్మకదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు జారీ చేయాలని, ఎరువుల ధరల పట్టికను దుకాణంలో స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ఎరువుల నిల్వల వివరాలు, విక్రయాల సమాచారం, అందుబాటులో ఉన్న రకాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా తగిన నిల్వలను నిర్వహిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీలర్లకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై నిరంతర తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఎరువుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎరువుల పంపిణీకి సంబంధించి ప్రతి లెక్కా చాలా పక్కాగా ఉండాలని.. ఎక్కడ ఎలాంటి ఫిర్యాధులు రానీయరాదన్నారు. ఎరువుల వివరాలు వాటి ధరలు, ఇప్పటి వరకు జరిగిన అమ్మకాల వివరాలను నోటీస్ బోర్డు నందు తప్పని సరిగా పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను సరైన విధంగా వినియోగించాలని, అవసరానికి మించి తీసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువులను అధిక ధరలకు అమ్మడం, ఇతర ప్రయోజనాలకు మళ్ళించడం వంటి వాటివి తారసపడితే వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఆకస్మీక తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట జి. కొండూరు తహాశీల్థార్ కె. ఆర్ రాణి, మండల వ్యవసాయ అధికారి కె. సిహెచ్ సూరిబాబు, మన గ్రోమోర్ సెంటర్ స్టోర్ మేనేజర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.