నమస్తే శ్రీ తేజ న్యూస్ విజయవాడ
క్రైస్తవులు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీ.వీ. హర్ష కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో క్రిస్టియన్ డెమోక్రటిక్ మూమెంట్ ఆధ్వర్యంలో 'మతమార్పిడి నిరోధక చట్టాలు - క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులు' అనే అంశంపై నిరసన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న హర్ష కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. జస్టిస్ కే. బాలకృష్ణన్ కమిషన్ మీద తనకు ఏమాత్రం నమ్మకం లేదని, హక్కుల సాధన కోసం క్రైస్తవ సమాజమంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మతమార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని, మైనార్టీల రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
క్రిస్టియన్ డెమోక్రటిక్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు పి.ఎ. మెల్కీ సెదేక్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా దేశంలోని 13 రాష్ట్రాలు తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాలు రాజ్యాంగానికి, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ చట్టాలను ఆసరాగా చేసుకుని అమాయక సువార్తికులను, పాస్టర్లను అక్రమంగా జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. ఉమామహేశ్వరరావు, సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం నేత ఆవుల శేఖర్, ఐ.సీ.ఎం చర్చ్ బిషప్ జాన్, ఏఐసీసీ నాయకులు ఎం. రాజేశ్వరరావు, ప్రసాద్ రవికాంత్, జమాత్ ఇస్లామిక్ హిందూ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కరీముద్దీన్, శ్యామ్ సుందర్, శ్యాముల్ రాజు, రూత్ భారతి, ఆర్.ఎస్. రాజు తదితరులు పాల్గొన్నారు.