రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విధ్వంసాన్ని, అరాచకాలను వివరిస్తూ.... ప్రజా ద్రోహానికి నిరసనగా వైకాపా ‘వెన్నుపోటు’ సభ

నమస్తే శ్రీ తేజ న్యూస్ విజయవాడ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రజలకు జరిగిన వంచనను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. మంగళవారం భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వెన్నుపోటుకి రెండేళ్లు పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆకాశంలోకి నల్ల బెలూన్లను ఎగురవేసి ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తన నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
జగనన్న పాలనే మాకు శ్రీరామరక్ష
ఈ సభలో వైకాపా ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన సామాన్య ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తమ ఇంటికే సంక్షేమం అందిందని, కానీ నేడు పథకాలు నిలిపివేతతో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా కంటక పాలనకు, గత ప్రభుత్వ సువర్ణ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లబ్ధిదారులు వివరిస్తూ ప్రస్తుత పాలకుల తీరును ఎండగట్టారు. అనంతరం వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఈ రెండేళ్ల కాలం ఒక చీకటి అధ్యాయం అని అభివర్ణించారు "నాడు జగన్ గారు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రతి వర్గాన్ని వంచిస్తోంది" అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన వైకాపా పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కళ్ళకు కట్టిన విధ్వంసం
గత రెండేళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విధ్వంసాన్ని, అరాచకాలను వివరిస్తూ ప్రదర్శించిన పీపీటీ ప్రజెంటేషన్ సభకులను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రూహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.