విశాఖ సుందరమైన నగరమని.. ఇలాంటి నగరంలో సైకిల్ పై ప్రయాణించటం మరింత ఆహ్లాదం కలిగిస్తుందని సీఎం పేర్కొన్నారు. విశాఖలో సైకిల్ పాత్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని సీఎం వివరించారు.

విశాఖపట్నం, జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తన తిరుగు ప్రయాణంలోనూ సైకిల్ పై హెలిపాడ్ వరకూ ప్రయాణించారు. నోవోటెల్ హోటల్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా వైఎంసీఏ, వుడాపార్కు సర్కిల్ , పోలమాంబ గుడి మీదుగా ఏయూలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు సైకిల్ పై ప్రయాణించారు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 17 నిమిషాల్లో సీఎం చేరుకున్నారు. దారిలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగారు. పర్యావరణ హితంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం కోసం సైకిల్ వినియోగించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. విశాఖ సుందరమైన నగరమని.. ఇలాంటి నగరంలో సైకిల్ పై ప్రయాణించటం మరింత ఆహ్లాదం కలిగిస్తుందని సీఎం పేర్కొన్నారు. విశాఖలో సైకిల్ పాత్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని సీఎం వివరించారు. కాలుష్య రహితంగా మన రాష్ట్రాన్ని తయారు చేసేందుకు ఉద్దేశించిన నెట్ జీరో కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమం ప్రారంభించినా విశాఖ వాసులు విజయవంతం చేస్తారని .. వివిధ సందర్భాల్లో నగర వాసులు తనకు అండగా నిలబడ్డారని సీఎం అన్నారు. విశాఖకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావటం ద్వారా రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశాఖను నాలెడ్జ్ హబ్ గా చేయాలని ప్రయత్నిస్తుంటే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వచ్చే రోజుల్లో అనేక అవకాశాలకు విశాఖ కేంద్రం అవుతుందని సీఎం అన్నారు. వివిధ ప్రాజెక్టులతో సమీప భవిష్యత్తులోనే అనేక అవకాశాల కేంద్రంగా విశాఖ రూపుదిద్దు కుంటుందన్నారు. త్వరలోనే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి విశాఖకు గోదావరి నీళ్లు తీసుకువస్తామని అన్నారు. విశాఖను మరింత సుందరంగా తీర్చిదిద్దటంతో పాటు సంపద సృష్టికి కేంద్రంగా మారుస్తామన్నారు.