ఏలూరు,జూన్, 5 : జిల్లాలో ఎంతో కాలంగా రైతులు, సామాన్యులు ఎదురుచూస్తున్న 22ఎ భూముల సమస్యకు ప్రభుత్వం విముక్తి కల్పించడం ఎంతోమందికి భారీఊరటనిచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సమీక్షాకమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా(22ఎ) లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు చేపట్టిన చర్యల్లో బాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 1749 మంది లబ్దిదారులకు చెందిన 917 ఎకరాలు 22ఎ జాబితానుండి తొలగించడం తనకు ఎంతో సంతతృప్తినిచ్చిందన్నారు. ఈ విషయంపై రెండు సార్లు మెగా గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల దగ్గర అర్జీలు స్వీకరించి అదే రోజున పరిష్కార చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవిన్యూ అధికారులు అహర్నిశలు కృషిచేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కైకలూరులో 500 ఎకరాలు స్ధానికి ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ సారధ్యంలో జిల్లా కలెక్టర్ వారి చొరవతో తీసుకున్నచర్యలు మూలంగా 22ఎ భూముల మినహాయింపుకు సిసిఎల్ఎ ద్వారా ఉత్తర్వులు జారీచేయబడ్డాయన్నారు. అదే విధంగా జిల్లాలో ఇంకా 480 ఎకరాల వరకు ఉన్నాయని వాటిలో 216 ఎకరాలు ఎండోమెంట్ కు సంబంధించి ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి పరిష్కారానికి త్వరలో గ్రీవెన్స్ డే ఏర్పాటుచేసి దేవాదాయ శాఖ, కమీషనరు, డిప్యూటీ కమీషనరు తదితరుల సహకారంతో 22ఎ జాబితానుండి తొలగించేందుకు చర్యులు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం వారి సారధ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అపనులు, సంక్షేమ పధకాలు పురోగతిని డిఆర్ సిలో సమీక్షించుకోవడం జరిగిందన్నారు. ఖరీఫ్ కు ఏవిధంగా సమాయాత్తం అయ్యేది కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందన్నారు. ఎన్నడూ లేని విధంగా అద్బుతంగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలలోపే రైతులకు సొమ్ములు చెల్లించడం జరిగిందన్నారు. నూకశాతం ఎక్కువగా వచ్చే వరి వంగడాలను సాగుచేయడం మానుకోవాలని మంత్రి సూచించారు. ఈ ధాన్యాన్ని ఎఫ్ సిఐ కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతుందన్నారు. అయితే గత సీజన్ లో రైతులను దృష్టిలో ఉంచుకొని సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నులు మొదటిసారిగా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అందువలన పిఆర్ 126, ఎంటియు 1153, ఎంటియు 1001, ఎంటియు 1010, ఎంటియు 1156, ఎంటియు 1293, ఎంటియు 1275, ఎంటియు 1061, ఎంటియు 1064 వరి వంగడాల వలన నూకశాతం ఎక్కువగా వస్తాయని అందుమూలంగా రైతులను వీటికి బదులుగా వేరే వరి వంగడాలను వేసేలా అవగాహన పరచాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించామన్నారు. అదే విధంగా ఫైన్ వెరైటీ(సన్నబియ్యం) 75 వేల ఎకరాల్లో సాగుచేసేలా ప్రోత్సహించాలని సూచించడం జరిగిందన్నారు. జిల్లాలో ఉధ్యాన పంటలను అభివృద్ధి చెందడం ద్వారా ప్రతి సంవత్సరం 15 శాతం వృద్ధిచెందేలా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రైతులకు అవగాహన పరచడం జరుగుతుందన్నారు. పామ్ఆయిల్,మిరియాల పంట, కోకో ప్రోసెసింగ్ సాగు సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 157 పుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నామని, మరో 150 యూనిట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పధకాన్ని మరింత విస్తృతం చేయాలన్నారు. మనజిల్లా రాష్ట్రంలో మొదటిస్ధానంలో ఉన్నప్పటికీ మరిన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు, గృహావసరాలకు పిఎం సూర్యఘర్ పధకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 300 యూనిట్లు ఈ మాసంలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో ఆర్గానిక్ ఉత్పత్తులు ప్రోత్సహించే దిశగా 31 సరుకులను ఉత్పత్తిచేయడం జరుగుతున్నదని వాటికి మార్గెటింగ్ సౌకర్యం కల్పించేందుకు పైలేట్ ప్రాజెక్టుగా ఆర్ టిసి బస్టాండ్లలో స్టాల్స్ ఏర్పాటుకు ప్రోత్సహించేలా ముందుకు వెళ్లాలన్నారు. భూ గర్భజలాలకు సంబంధించి ఏలూరు జిల్లాలో ఇబ్బందికరమైన పరిస్ధితులు ఉన్నాయని, 21 మీటర్లు లోతులోఉన్న భూగర్బ జలాలను కనీసం 16 మీటర్లకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లా భూగర్భజలాల పెంపులో పురోగతి సాధించిన దృష్ట్యా ఆ జిల్లాలో పరిస్ధితులను పరిశీలించేందుకు ఒక బృందాన్ని పంపడం జరిగిందన్నారు. జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో భూ గర్బజలాలపెంపుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఎన్ డిఏ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపద్యంలో జూన్ 9 నుండి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇటీవల వంటగ్యాస్ ఇబ్బందులు ఏర్పడ్డాయని, ప్రస్తుతం ఎటువంటి కొరతలేదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు అవకాశం ఉన్న ఏలూరు, నూజివీడులో ఎల్ పిజి బదులు పిఎన్ జి గ్యాస్ కనెక్షన్లు అందించేందకు చర్యలు తీసుకున్నామన్నారు. ఏలూరు నగరంలో వెయ్యి కనెక్షన్లు, నూజివీడులో 2 వేలు కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. దీపం పధకం కింద ఏవిధమైన రాయితీ కల్పిస్తున్నామో అదే విధంగా పిఎన్ జి గ్యాస్ కనెక్షన్లకు కూడా వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అబిషేక్ గౌడ, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్, తదితరులు పాల్గొన్నారు.