గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి కందుల దుర్గేష్*

అమరావతి/తిరువనంతపురం (కేరళం)

*ఏపీ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. అదొక మరపురాని అనుభూతి: పర్యాటక మంత్రి కందుల దుర్గేష్*
*రాష్ట్రంలో పర్యాటక రంగ ప్రగతిని, విశిష్టతలను 'గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026' వేదికపై చాటిచెప్పిన మంత్రి కందుల దుర్గేష్.*

*రేపు(జూన్ 4) కోవాలంలోని ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’లో జరిగే జీటీఎం అవార్డ్స్-2026 వేడుకలో దేశవిదేశాల ప్రముఖుల సమక్షంలో ఏపీకి దక్కిన "బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్" అవార్డును అందుకోనున్న మంత్రి దుర్గేష్*

*36.42 కోట్ల పర్యాటక సందర్శనలతో ఏపీ సరికొత్త రికార్డు సాధించిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి..అంతర్జాతీయ పర్యాటకంలో 48 శాతం వృద్ధితో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని స్పష్టం*

*‘భారతదేశపు ప్రతి అణువూ ఏపీలోనే ఉంది’.. గ్లోబల్ వేదికపై కొనియాడిన పర్యాటక ప్రతినిధులు*

అమరావతి/తిరువనంతపురం (కేరళం): "ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. అదొక మరపురాని అనుభూతి. ఇక్కడ ప్రతి ప్రయాణమూ ఒక కథను చెబుతుంది, ప్రతి సందర్శకుడూ అందులో ఒక భాగమవుతారు" అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. బుధవారం కేరళం రాజధాని తిరువనంతపురంలో జరుగుతున్న దక్షిణ భారతదేశపు ప్రతిష్టాత్మక బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) పర్యాటక వేదిక 'గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026' సదస్సు ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. *దేశ పర్యాటక రంగంలో ఏపీ ఒక కీలక శక్తిగా ఎదుగుతోందని కొనియాడుతూ, రాష్ట్రానికి "బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్" (ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రం) అవార్డును ఖరారు చేశారు. రేపు(జూన్ 4) కోవాలంలోని ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’లో జరిగే జీటీఎం అవార్డ్స్-2026 వేడుకలో దేశవిదేశాల ప్రముఖుల సమక్షంలో ఏపీకి దక్కిన "బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్" మంత్రి దుర్గేష్ అందుకోనున్నారు.*
ఈ సదస్సులో ప్రత్యేకంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ప్రస్తుతం ఒక అద్భుతమైన పరివర్తనను చూస్తోందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఏకంగా 36.42 కోట్ల పర్యాటక సందర్శనలను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని వెల్లడించారు.దేశీయ పర్యాటకంతో పాటు, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యలో ఏకంగా 48% పైగా స్పష్టమైన వృద్ధి నమోదైందని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా దేశీయ పర్యాటకులు సందర్శించే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నిలవడం గర్వకారణమని ఆయన అన్నారు.
రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'పర్యాటక విధానం 2024-29' గురించి మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.ఈ విధానం ద్వారా క్యాపిటల్ సబ్సిడీలు, 100% SGST రీయింబర్స్‌మెంట్ మరియు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం ద్వారా ఇప్పటికే సుమారు రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో సరికొత్త హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు.
కేవలం వచ్చి వెళ్లే 'స్టాప్‌ఓవర్ టూరిజం'(స్వల్పకాలిక బస) నుండి పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండి ఇక్కడి విశేషాలను ఆస్వాదించే 'ఎక్స్‌పీరియెన్షియల్ టూరిజం' (అనుభవపూర్వక పర్యాటకం) వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా 7 యాంకర్ పర్యాటక హబ్‌లతో పాటు 25కు పైగా థీమాటిక్ సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు..2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
300కు పైగా ఎగ్జిబిటర్లు, 1,000 మందికి పైగా బయ్యర్లు పాల్గొన్న ఈ GTM 2026 సదస్సు, ఏపీ పర్యాటక ప్యాకేజీలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు అద్భుత వేదికగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైవిధ్యతను చూసి ప్రతినిధులు సైతం "భారతదేశపు ప్రతి అణువూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది" అని కొనియాడారు.తిరుపతి, శ్రీశైలం వంటి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, భారతదేశంలోనే రెండో అతిపెద్దదైన 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం మరియు అందమైన బీచ్‌లు,అరకు లోయ, లంబసింగి మరియు విస్తారమైన మడ అడవులు , గండికోట, లేపాక్షి, అమరావతి వంటి చారిత్రక వారసత్వ సంపద, సాంప్రదాయక వంటకాలు, భౌగోళిక గుర్తింపు (GI Tag) పొందిన విశిష్ట హస్తకళలు తదితర రాష్ట్రంలో అన్ని రకాల పర్యాటక అనుభూతులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. పర్యాటక రంగం కేవలం ప్రయాణం మాత్రమే కాదని, ఇది ఉపాధిని, కళాకారుల జీవనోపాధిని పెంపొందించే ఆర్థిక చోదక శక్తి అని ప్రతినిధులు పేర్కొన్నారు. యావత్ దక్షిణ భారతదేశాన్ని గ్లోబల్ టూరిజం పవర్‌హౌస్‌గా మార్చడానికి ప్రాంతీయ సహకారం అవసరమని పిలుపునిస్తూ.. పర్యాటక రంగ పెట్టుబడిదారులు, టూర్ ఆపరేటర్లు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి, భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ సాదరంగా ఆహ్వానించారు.
కార్యక్రమంలో కేరళం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సీపీ జాన్, కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా, కేరళం శాసనసభ్యులు, అధికారులు, పర్యాటక శాఖ స్టేక్ హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు.